Swami listens to our pain
Guravaiah swami devotee Syamala from India says:
ఓం నమో శ్రీ గురు స్వామియే నమః 2012వ సంవత్సరంలో మా అక్క గారి పెద్ద కుమార్తె చదువు నిమిత్తం వారి పల్లెకి దగ్గరలో ఉన్న ఊరిలో ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఆరవ తరగతి చదువుతూ ఉండేది. ఆ సమయములో తన సహచరులతో కలవలేక మానసికంగా కృంగిపోయేది.ఆ పాపను వారు ఇంటికి తీసుకుని వచ్చి కొద్దిరోజులు ఉంచుకొని తర్వాత పాఠశాలకు పంపించాలని తలచారు.ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాప చదువుకోవడానికి సుముఖత చూపలేదు, కానీ పెద్దలు భవిష్యత్తు పాడవుతుంది, చదువుకోవాలని బలవంతం చేసేవారు. ఆ చిన్న పాప తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆ పాపను తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. డాక్టర్లు పరీక్షించి మూడురోజులపాటు ప్రాణాలతో ఉంటే చూద్దాం,లేకపోతే కష్టము అని తేల్చేశారు.వెంటిలేటర్ పై వున్నా అన్నవాహిక పూర్తిగా నొక్కుకునిపోవడంచేత, ఊపిరి తీసుకోలేక పోయింది.పరిస్థితి చాలా విషమంగా ఉండటం జరిగింది. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి విషయం అంతా వివరించారు. ఆ సమయంలో కూడా నేను శ్రీస్వామి వారి సన్నిధిలోనే ఉండడం జరిగింది. నేను వెంటనే శ్రీ స్వామి వారిని ఆ పాపను బతికించమని వేడుకున్నాను.కానీ శ్రీ స్వామివారు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. నేను బాధతో ఆ రోజు సాయంత్రం ధుని తిరుగుతూ ఉంటే, ప్రదక్షిణ సమయంలో శ్రీ స్వామివారు ధునిలోకి వచ్చి నిలుచున్నారు.నేను వెంటనే "నాయనా ఆ పాపని బతికించండి అని చెప్పి వేడుకున్నాను". శ్రీ స్వామివారు "మూడు రోజుల తర్వాత చూద్దాం" అన్నారు. నేను వెంటనే డాక్టర్లు కూడా అదే మాట చెప్పారు,మీరు కూడా అదే మాట అంటే ఎలా నాయనా ! ఆ పాపను కాపాడాలి అని చెప్పి ఎడ్చేసాను. మళ్ళీ రాత్రికి నాయన అన్నదానసత్రం లోనికి వచ్చి మూడోరోజు వూపిరి వస్తుంది లేమ్మా అన్నారు. అన్నట్టుగానే మూడోరోజు ఆ అమ్మాయి సొంతంగా ఆక్సిజన్ తీసుకోవడం మొదలుపెట్టింది.ఆ తర్వాత పదిహేను రోజులకు ఆ పాప ఆరోగ్యం కుదుటపడి హాస్పిటల్ నుంచి బయటకు రావడం జరిగింది. నేను ఆ పాప తండ్రికి గురువు గారి మహిమ గురించి వివరించాను. గొప్ప నమ్మకంతో ఆశ్రమమునకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీ స్వామివారు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పారు ఆ సమయంలో అతనికి అర్థం కాలేదు. సరిగ్గా పది రోజులకు అతను స్కూటర్ పై ప్రయాణిస్తుండగా ఎదురుగా ఒక లారీ వచ్చి ఢీకొంది. ప్రాణం పోయింది అని అనుకున్నారు అందరు, కానీ శ్రీ స్వామివారి ముందే హెచ్చరిక చేసి ఉండటం వలన, స్వామి వారి దయవలన అతనికి కాళ్లకు మాత్రమే దెబ్బలు తగిలి కట్టుకట్టించుకుని మూడు నెలలపాటు మంచానికే పరిమితమయ్యాడు. తర్వాత స్వామివారిని దర్శించుకుని, స్వామి ఆశీర్వాదం పొందడం జరిగింది ఈ సంఘటనలన్నీ జరగకముందు ఆ కుటుంబానికి స్వామి వారితో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక భక్తురాలు వారి గురించి విన్నవించుకోవడంతోనే స్వామివారు వారిపై ఇంత దయ, ప్రేమ చూపించి, వారిని కాపాడారు. శ్రీ స్వామివారి మహిమ,కరుణ ఎంతటిదో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ సరిపోతుందేమో ! ఓం నమో శ్రీ గురవయ్య స్వామియే నమః