Saturday, May 2, 2020

Swami Blessings - Experiences Part 4

Swami listens to our pain 



Guravaiah swami devotee Syamala from India says:
ఓం నమో శ్రీ గురు స్వామియే నమః 2012వ సంవత్సరంలో మా అక్క గారి పెద్ద కుమార్తె చదువు నిమిత్తం వారి పల్లెకి దగ్గరలో ఉన్న ఊరిలో ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఆరవ తరగతి చదువుతూ ఉండేది. ఆ సమయములో తన సహచరులతో కలవలేక మానసికంగా కృంగిపోయేది.ఆ పాపను వారు ఇంటికి తీసుకుని వచ్చి కొద్దిరోజులు ఉంచుకొని తర్వాత పాఠశాలకు పంపించాలని తలచారు.ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాప చదువుకోవడానికి సుముఖత చూపలేదు, కానీ పెద్దలు భవిష్యత్తు పాడవుతుంది, చదువుకోవాలని బలవంతం చేసేవారు. ఆ చిన్న పాప తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆ పాపను తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. డాక్టర్లు పరీక్షించి మూడురోజులపాటు ప్రాణాలతో ఉంటే చూద్దాం,లేకపోతే కష్టము అని తేల్చేశారు.వెంటిలేటర్ పై వున్నా అన్నవాహిక పూర్తిగా నొక్కుకునిపోవడంచేత, ఊపిరి తీసుకోలేక పోయింది.పరిస్థితి చాలా విషమంగా ఉండటం జరిగింది. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి విషయం అంతా వివరించారు. ఆ సమయంలో కూడా నేను శ్రీస్వామి వారి సన్నిధిలోనే ఉండడం జరిగింది. నేను వెంటనే శ్రీ స్వామి వారిని ఆ పాపను బతికించమని వేడుకున్నాను.కానీ శ్రీ స్వామివారు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. నేను బాధతో ఆ రోజు సాయంత్రం ధుని తిరుగుతూ ఉంటే, ప్రదక్షిణ సమయంలో శ్రీ స్వామివారు ధునిలోకి వచ్చి నిలుచున్నారు.నేను వెంటనే "నాయనా ఆ పాపని బతికించండి అని చెప్పి వేడుకున్నాను". శ్రీ స్వామివారు "మూడు రోజుల తర్వాత చూద్దాం" అన్నారు. నేను వెంటనే డాక్టర్లు కూడా అదే మాట చెప్పారు,మీరు కూడా అదే మాట అంటే ఎలా నాయనా ! ఆ పాపను కాపాడాలి అని చెప్పి ఎడ్చేసాను. మళ్ళీ రాత్రికి నాయన అన్నదానసత్రం లోనికి వచ్చి మూడోరోజు వూపిరి వస్తుంది లేమ్మా అన్నారు. అన్నట్టుగానే మూడోరోజు ఆ అమ్మాయి సొంతంగా ఆక్సిజన్ తీసుకోవడం మొదలుపెట్టింది.ఆ తర్వాత పదిహేను రోజులకు ఆ పాప ఆరోగ్యం కుదుటపడి హాస్పిటల్ నుంచి బయటకు రావడం జరిగింది. నేను ఆ పాప తండ్రికి గురువు గారి మహిమ గురించి వివరించాను. గొప్ప నమ్మకంతో ఆశ్రమమునకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీ స్వామివారు అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పారు ఆ సమయంలో అతనికి అర్థం కాలేదు. సరిగ్గా పది రోజులకు అతను స్కూటర్ పై ప్రయాణిస్తుండగా ఎదురుగా ఒక లారీ వచ్చి ఢీకొంది. ప్రాణం పోయింది అని అనుకున్నారు అందరు, కానీ శ్రీ స్వామివారి ముందే హెచ్చరిక చేసి ఉండటం వలన, స్వామి వారి దయవలన అతనికి కాళ్లకు మాత్రమే దెబ్బలు తగిలి కట్టుకట్టించుకుని మూడు నెలలపాటు మంచానికే పరిమితమయ్యాడు. తర్వాత స్వామివారిని దర్శించుకుని, స్వామి ఆశీర్వాదం పొందడం జరిగింది ఈ సంఘటనలన్నీ జరగకముందు ఆ కుటుంబానికి స్వామి వారితో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక భక్తురాలు వారి గురించి విన్నవించుకోవడంతోనే స్వామివారు వారిపై ఇంత దయ, ప్రేమ చూపించి, వారిని కాపాడారు. శ్రీ స్వామివారి మహిమ,కరుణ ఎంతటిదో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ సరిపోతుందేమో ! ఓం నమో శ్రీ గురవయ్య స్వామియే నమః

Swami Blessings - Experiences Part 3

How Swami helped me in difficult situtations




Guravaiah swami devotee Syamala from India says:

ఓం నమో శ్రీ గురవయ్య స్వామినే నమః
2015వ సంవత్సరంలో శ్రీ స్వామివారి మండలారాధన మహోత్సవములు జరుగుతున్నవి.నేను నా భర్తతో కలసి ఆశ్రమమునకు చేరుకోవడానికి ఒక ప్రైవేటు బస్సు ఎక్కి మల్లవరంలోని గురవయ్య స్వామి గుడిదగ్గర ఆపండి అని డ్రైవరుకు విన్నవించుకున్నాము. అతను మాకు తెలియదు, మీరు లేచి వచ్చి ప్రదేశం చూపిస్తే బస్సు ఆపుతాను అన్నాడు.మేము అలాగే అని చెప్పి బస్సులో ఎడమ వైపు ముందు సీట్లో కూర్చున్నాము.
శ్రీ స్వామివారి మహాసమాధి అనంతరం ఆశ్రమమునకు విరివిగా ప్రయాణం చేయడం మరియు ఉద్యోగ పరమైన ఒత్తిడుల వలన ఇద్దరమూ బాగా అలసిపోయివున్నాము
బస్సు బెంగళూరు దాటగానే, ఇద్దరమూ మంచి నిద్రలోకి జారుకున్నాము. , ఆ ప్రదేశమే తెలియదు అన్న వ్యక్తి మల్లవరం సాయిబాబా గుడి దగ్గర 15నిమిషాలు బస్సు ఆపి మల్లవరంలో దిగవలసిన వాళ్ళు రండి అని అరుస్తూ వున్నారు, బస్సులో అందరికి మెలకువ వచ్చి మేముకాదు మేముకాదు అంటున్నారు.ముందర వున్న మాకు మాత్రం మెలకువ రాలేదు, ఎవరో వచ్చి ఆ ముందర పడుకున్న వాళ్ళని అడగండి అని అన్నారు.అప్పుడు ఆ వ్యక్తి వచ్చి మమ్మల్ని నిద్రలేపి మీరేనా మల్లవరంలో దిగాల్సింది అని అడిగాడు, అవును అని సమాధానం చెప్పగానే, 15నిమిషాల నుండి అరుస్తున్నాను, మరి ఇంత మొద్దు నిద్ర అయితే ఎలాగా, మీ స్వామి ఎవరో కానీ బలే కాపాడాడు, బస్సు చిన్న సమస్య వచ్చి ఆగింది, అది చెక్ చేయడానికి బస్సు అపాము.ఇది మల్లవరం అని కింద ఎవరో చెబితే మీరు బస్సు ఆపమన్న విషయం గుర్తుకు వచ్చింది, లేకపోతే విజయవాడ వెళ్ళిపో దుము అన్నాడు.
శ్రీ స్వామి వారి మహిమ కాకపోతే మల్లవరం దగ్గర బస్సు ఆగిపోవడం, ఆ వ్యక్తి మమ్ములను గుర్తు ఉంచుకుని నిద్రలేవడం అంతా ఎదో గమ్మత్తుగా జరిగింది.
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః

మరియొక సంఘటన 

ఓం నమో శ్రీ గురవయ్య స్వామినే నమః
శ్రీ స్వామివారి మహాసమాధి అనంతరం నేను మరియు నాభర్త ప్రతి వారాంతంలో బెంగళూరు నుండి మల్లవరం ఆశ్రమమునకు వెళ్లి సేవ చేసుకోవడం అలవాటు.
2018వ సంవత్సరంలో నా భర్త ఉద్యోగనిమిత్తము గురుగ్రాంలో వుండేవారు. నేను ఒక్కదాన్నే ఆశ్రమానికి వెళ్లేదాన్ని , ఒక శుక్రవారం రాత్రి బెంగళూరు నుండి శ్రీకాళహస్తి వెళ్లే బస్సు ఎక్కాను.నేను ప్రయాణించే బస్సు నేరుగా ఆశ్రమం ముందే ఆపుతారు.పలమనేరు దాటిన తరువాత నేను మంచి నిద్రలోకి జారుకున్నాను,ఉన్నట్టుండి మెలకువ రావడంతో బయటకు చూసాను, బస్సు ఆశ్రమం దాటి మల్లవరం వెళ్లిపోతోందని భ్రమపడి డ్రైవర్ మీద కోపంతో ముందుగా మాట్లాడినట్టు మల్లవరం దగ్గర బస్సు ఆపకుండా వెళ్ళిపోతావా అని అరిచి, బస్సు ఆపించి దిగేసాను.చాలా ముందుకు వచ్చేసాను అని అనుకుంటూ వెనకకు ఒక కిలోమీటరు మేర నడిచాను, కానీ ఆచుట్టుప్రక్కల ఒక ఇల్లు కాని, అంగడి కానీ లేవు.నాకు భయం వేసింది, అప్పుడు సమయం తెల్లవారుజాము 2గంటల 45నిమిషాలు, చుట్టూ చీకటి,రోడ్డుపై వచ్చే వాహనాల వెలుతురు తప్ప ఏమీ లేదు.చేతిలో మొబైల్ వున్న సంగతి కూడా మరిచిపోయాను ఆ కంగారులో. కాసేపు రోడ్డు ప్రక్కగా ఆగి శ్రీ స్వామి వారిని మనస్సులో గట్టిగా తలచుకున్నా, కంగారు కాస్త తగ్గింది, అప్పుడు గుర్తుకువచ్చింది, మొబైల్ వుంది (దురదృష్టం ఏమంటే మొబైల్ టారిఫ్ కూడా అయిపోయింది), ఎక్కడవున్ననో తెలుస్తుంది అనుకుని లొకేషన్ చూస్తే అది పూతలపట్టు అటవీప్రాంతం, తరువాత తెలిసింది అది నక్సలైట్లు సంచరించే ప్రదేశమని, 
రోడ్డుపైకి వచ్చి బస్సులు ఆపే ప్రయత్నం చేశాను,మిగతా లారీలు, కార్లు లాంటి వాహనాలు దగ్గరికి వస్తున్నాయి కానీ, ఒక్క బస్సు కూడా ఆపడం లేదు.ఒక ప్రక్క విసుగు మరో పక్క భయంతో ఎక్కడైనా దాక్కుని, తెల్లవారు ఝామున బయటికి వద్దామని అనుకున్నాను, చివరి ప్రయత్నంగా నాయన మీద భారం వేసి ఈసారి ఏ బస్సు అయినా సరే ఆగితే ఎక్కెద్దామని నిశ్చయించుకున్నాను.ఒక 10నిమిషాలు ఎదురుచూసిన పిమ్మట ఒక ప్రైవేటు ఏసీ బస్సు ఆగింది.ఆ బస్సు డ్రైవర్, అతని సహాయకులు నన్ను బస్సు ఎక్కించుకుని ఎవరమ్మా నీవు, ఈ సమయంలో ఇక్కడికి పోలీసులు రావడానికి కూడా భయపడతారు,ఎవ్వరూ ధైర్యం చేసి ఇక్కడ బస్సులు ఆపరు,ఇదంతా నక్సలైట్లు ఉండే ప్రదేశం అన్నారు.
నేను నిద్రమత్తులో మల్లవరం గురవయ్య స్వామి ఆశ్రమం అనుకుని దిగేసాను, ఆ డ్రైవర్ని అడిగితే ఇది మల్లవరం కాదని ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నాను.వారు వెంటనే మేము కూడా వెంకయ్య స్వామి భక్తులము, నిత్యం గొలగమూడికి వెళతాం అన్నారు.మనస్సులో నాయనకు,వెంకయ్య స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.వారు నన్ను తిరుపతి ఆర్టీసీ బస్టాండు వద్ద జాగ్రత్తగా దింపివేసారు.
బస్టాండులోకి వెళ్లేసరికి నన్ను మద్యదారిలో దింపేసి వచ్చిన బస్సు అక్కడేవుంది.ఆ డ్రైవర్,కండక్టర్ని గట్టిగా మందలించి మీ పైన కేసు వేసి ఉద్యోగాలు వూడగొడతాను అని బెదిరించాను.వారు వచ్చి అందరిముందూ నాకు క్షమాపణలు చెప్పి, నిద్రమత్తులో మాకేమీ అర్థం కాలేదు అని బాధపడ్డారు.వారి సంగతి నాయనే చూసుకుంటారు అని వదిలేసాను.ఆ తరువాత ఆ బస్సులోనే ఉదయం 4 గంటలకు శ్రీ స్వామి వారి ఆశ్రమమునకు చేరుకోవడం జరిగింది. 
సదా మీ బిడ్డల రక్షణ భారం మీరు వహిస్తారు అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి కావాలి తండ్రీ.
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః

మరియొక సంఘటన 

ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
2019వ సంవత్సరం జనవరిలో నా భర్త కెన్యాలో ఉండేవారు.ఆ సమయంలో కూడా నేను ఒంటరిగానే ఆశ్రమముకు వెల్లేదాన్ని, ఆదివారం రాత్రి 8గంటలకు తిరుపతిలో బయలుదేరి అర్ధరాత్రి ఒంటిగంటన్నర కు బెంగళూరు టిన్ ఫ్యా క్టరి బస్టాప్ లో బస్సు దిగాను.ఆ సమయంలో బస్టాప్ లో నలుగురు దూరం దూరంగా కూర్చుని వున్నారు, అంతకుమించి మనుషులు ఎవరూ లేరు. రోడ్డుపై కాస్త దూరంగా అక్కడక్కడా ఒకరిద్దరు వున్నారు.నేను ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేస్తున్నాను.ఎంతకీ ఒక క్యాబ్ కూడా బుక్ అవడంలేదు, ఇంతలో నాకు కాస్త దూరంలో సూటు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు స్కూటరు ఆపి నావైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు.అంతకు ముందే బస్టాప్ ముందు రెండుసార్లు అటూఇటూ స్కూటరులో తిరిగారు. వారి మాటలాడుకొనే విధానాన్ని బట్టి, ఒంటరిగా వున్న నన్ను టార్గెట్ చేశారని అర్థమయింది.
నేను ఎదురుతిరిగితే, వారి ఇంట్లో అమ్మాయి అలిగి వచ్చేసింది అని అక్కడవున్నవాళ్ళను ఒప్పించాలని కూడా అనుకుంటున్నారు.
నాకేమో ఒక్క క్యాబ్ కూడా బుక్ అవడంలేధు. నాయనా నాయనా అనుకుంటూ క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను.వారిలో ఒకడు నా దగ్గరగా వస్తున్నాడు.నాకు కంగారు ఎక్కువయింది, ఎవరూ సహాయం చేసేవారు లేరు, పోలీసుల కోసం చుట్టూ చూసాను, పోలీసు వాహనం వుంది కానీ అందులో ఎవరూ లేరు. ఇంకొక్క రెండు అడుగులు వాడు వేస్తే నన్ను చేరుకుంటాడు, అదే సమయంలో నాముందు వేగంగా ఒక కారు ఆగడం, నా ఫోన్ లో క్యాబ్ వివరాలు రావడం ఒకేసారి జరిగింది. వెంటనే కారులో ఎక్కికూర్చున్నాను. ఎంత వేగంగా కారు వచ్చి ఆగిందో, అంతే వేగంగా బయలుదేరింది.
నన్ను పట్టుకోవాలని చూసిన వ్యక్తి వెంటనే వెనక్కు వెళ్ళి, ముగ్గురూ కలిసి స్కూటరు పైన మూడు కిలోమీటర్లు మా కారును వెంబడించారు. మా కారు వేగాన్ని అందుకోలేక వారు ఆగిపోయారు.టిన్ ఫ్యాక్టరీ బస్టాప్ నుండి మా ఇంటికి మామూలుగా 45-50 నిమిషాల సమయం పడుతుంది.అటువంటిది కేవలం ఇరవైనిమిషాలలో మా ఇంటిదగ్గర వున్నాను.ఇన్ని సంవత్సరాలుగా ఏనాడూ క్యాబ్ సమయానికి రావడం కానీ, కనీసం రెండుమూడు సార్లు ఫోన్ చేసి డ్రైవరు చెప్పిన దగ్గరికి మేము వెళ్ళవలసి వచ్చేది. అటువంటిది ఈ అపత్సమయంలో వచ్చిన కారు డ్రైవరు నాకు సాక్షాత్తూ శ్రీ గురవయ్య స్వామి వారే అనిపించింది.
కారులో కూర్చున్న తరువాత వారు వెంబడిస్తుంటే నేను వారిగురించి చాలా బాధపడ్డాను" వీరు అనవసరంగా నా జోలికి వస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు, అనవసరంగా భవిష్యత్తు పాడు అవుతుంది, నాయన వీళ్ళని వదలరు, వీళ్ళ గతేమవుతుందో అని"
శ్రీ గురవయ్య స్వామి వారు తన బిడ్డలను ఎలా వెంటవుండి రక్షిస్తారో ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి కావాలి.
ఓం నారాయణ ఆది నారాయణ
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః.



Thursday, April 23, 2020

Swami Blessings - Experiences Part 2

Chardham Yatram with Swami 



Guravaiah swami devote Shyamala from India says :

ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
శ్రీ స్వామి వారితో నా చార్థామ్ యాత్రా విశేషాలు,
2013 లో నేను బ్యాంక్ ఉద్యోగం మానేసి, సాఫ్టవేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, శ్రీ స్వామి వారి సేవకుడు ఒకరు ఫోన్ చేసి" శ్రీ స్వామి వారికి ఎంతో అవసరంగా 2 లక్షల రూపాయల కావాలి, ఎలా ఇవ్వగలవు నువ్వు అని అడిగాడు".నేను వెంటనే నా నగలు కుదవ పెట్టి ఇస్తాను అన్నాను.ఆ సేవకుడు అయితే వెంటనే అకౌంట్ లో డబ్బులు వెయ్యి అన్నాడు.మరుసటి రోజున నగలు కుదువ పెట్టి 2 లక్షల రూపాయలు స్వామి వారి అకౌంట్ లో వేసేసాను.
తరువాత నెల రోజులకు, శ్రీ స్వామి వారి ఆశ్రమంలో ఫంక్షనుకు నేను, నా భర్త తో కలిసి వెళ్ళాను.స్వామి వారు నన్ను పిలిచి,నాతో హిమాలయాలకు వస్తావా! యాత్రకు పోతున్నాం అన్నారు.నేను వెంటనే నాకు రావలనే వుంది నాయన, కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అన్నాను.శ్రీ స్వామి వారు వెంటనే "అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు వచ్చేయ్"అన్నారు.అయితే ఆనంద్ తో చెప్పండి అన్నాను. స్వామి వారు నా భర్తకు యాత్ర గురించి చెప్పి ఒప్పించారు.
ఈ యాత్ర గురించి నాకు చెప్పేసరికి, బదరీనాథ్ క్షేత్రం గురించి నాకు తెలియదు,ఫొటో కూడా ఎప్పుడూ చూసింది లేదు.అప్పట్లో ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ బదరీనాథ్ క్షేత్రం స్వప్నంలో వచ్చేది.తొలి 15 రోజులపాటు గుడి బయట మెట్ల పైన రాత్రంతా పడుకుని ఏడ్చినట్టు వచ్చేది, స్వామి నన్ను లోపలకి రానివ్వలేదు. 16 వ రోజు నుంచి శ్రీ లక్ష్మిదేవి అమ్మవారు సకలాలంకార భుషితురాలై ఆ మెట్ల పైన నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకొని ఒదార్చేవారు.
21వ రోజు నుండి వారం రోజుల వరకు గుడి ప్రాంగణంలో నన్ను పడుకోబెట్టుకొని ఒదార్చేవారు.చివరిగా కలలో
నేను అమ్మవారితో కలసి బదరీనాథ్ క్షేత్రంలో వున్న విష్ణుగుండంలో మూడు మునకలు వేసి నీళ్లలో నించున్నాం. ఆ నీళ్లలో నుంచి బదరీనాదుని మూర్తి పైకి లేచి అలా ఆగి కాసేపు దర్శనమిచ్చి అంతర్ధనమైనారు.
ఆ తరువాత ఆశ్రమంకు వెళ్ళినప్పుడు ఈ యాత్ర గురించి శ్రీ స్వామి వారు నాకు చెప్పడం జరిగింది.అప్పుడే నాకు అర్థమైంది శ్రీ స్వామి వారు నాకు అర్హత ముందు కలిగించి తరువాత యాత్రకు తీసుకుని వెళ్లారు అని.ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కలలో నేను పడుకున్న మెట్లు, విష్ణు గుండం అంతా స్వప్నంలో చూసిన విధంగానే వున్నాయి. గుడిప్రాంగణంలో నన్ను లక్ష్మీదేవి పడుకోబెట్టుకొని వున్న ప్రదేశంలో శ్రీ లక్ష్మీదేవి ఆలయం వుంది.శ్రీ భద్రినాధుని దర్శనానంతరం శ్రీ స్వామి వారు అమ్మవారి గుడి ప్రక్కన గట్టుపై కూర్చున్నారు.నా స్వప్నం అంతా నిజంగా కళ్ళారా చూసిన తరువాత ఆనంద పారవశ్యంతో శ్రీ స్వామి వారి పాదాలపై తల పెట్టుకొని ఎడ్చేసాను.శ్రీ స్వామివారు నాతలపై చేయివుంచి ఆశీర్వదించారు.
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః.
*******ఈ యాత్రకు సంబంధించిన మరియొక లీల****
నా శరీరతత్వానికి చలి అస్సలు పడదు, వాహనంలో వేసే ఏసీకి ఊపిరి ఆడదు. హిమాలయాలకు వెళ్ళడం అంటే చిన్నవిషయం కాదు నాకు.ప్రాణాలతో తిరిగి వస్తానని నమ్మకం లేదు. ఒక వైపు భయం, మరో వైపు అంతటి మహాత్ముడితో తీర్థయాత్రలు చేసే సదావకాశం వదులుకోకూడదు అనే తలంపు, రెండూ వుండేవి.కానీ ప్రాణాలతో తిరిగి వస్తానని మాత్రం నమ్మకం లేదు.ఎందుకంటే ఇంట్లో మామూలుగా ఫ్యాన్ వేసినా తట్టుకోలేక కంబళ్లు కప్పుకుని పడుకునేదాన్ని.అటువంటి నాకు హిమాలయాలు దుర్భేద్యమైనవి.కారు ఏసీకి హిమాలయాలకు వెళ్ళకముందే నేను హాస్పిటల్లో చేరవలసి వుంటుంది అని ముందే నిశ్చయానికి వచ్చేసాను.
మే నెలలో శ్రీ స్వామి వారి పుట్టినరోజు తరువాతి రోజు 2 ఇన్నోవా కార్లలో మొత్తం 11మందిమి యాత్రకు బయలుదేరాం. కారు ఎక్కేముందు గుడిలోకి వెళ్ళి వెంకయ్య స్వామి పాదుకలపైన తలపెట్టి వుంచాను.వెంటనే శ్రీ వెంకయ్య స్వామి వారి మూర్తి నుంచి, పాదుకల మీదుగా మూడు నామాలు, శంకు, చక్రం నాలోనికి ప్రవేశిస్తున్నట్టు అవగతమైంది.
మనస్పూర్తిగా శ్రీ స్వామి వారి మూర్తికి నమస్కరించుకుని బయటకు వచ్చి నాయన పాదాలపై పడ్డాను.నాయన ఆశీర్వదించి ఎంకాదులే నేనున్నాను అన్నారు.
శ్రీ స్వామి వారి కరుణ ఇంత అని చెప్పడానికి వేయి నాలుకల ఆదిశేషువు కూడా సరిపోడు.కారులో ఫుల్ ఏసీ వేసినా కూడా నాకు ఏవిధమైన ఇబ్బంది కలగలేదు. హిమాలయ యాత్ర మొత్తం మీద ఒక్క యమునోత్రి లో తప్ప ఎక్కడా స్వెట్టర్ కానీ, శాలువా కానీ వాడే అవసరమే రాలేదు. నాతో పాటు వచ్చిన వారు ఏదో ఒకరకంగా అనారోగ్యం పాలు అయ్యారు, కానీ నేను మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాతో వచ్చిన భక్తులకు అందరికి భోజనం చేసి పెడుతూ సంతోషంగా తిరిగి వచ్చాను.
మీరు చూపిన ప్రేమకు నా జన్మ అంతా మీ పాద సేవ చేసుకున్నా సరిపోదు నాయన !!!
ఓం నమో భగవతే శ్రీ శ్రీ శ్రీ గురవయ్య స్వామినే నమః

Monday, April 20, 2020

Swami Blessings - Experiences Part 1

My Marriage Happened with Swami's Blessings


Experiences with Guravaiah Swami: Swami Photo

Guravaiah swami devote Shyamala from India says : 

ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
నా వివాహ ప్రయత్నములు జరుగుతున్న సమయంలో, నేను శ్రీ స్వామి వారికి నా మనస్సులో ఈ విధంగా విన్నవించుకొనేదానను" స్వామి అందంగా వుండి, మంచి ఎత్తు, మంచి మనసు కలిగిన వ్యక్తి తో నాకు వివాహం కావాలి" అని. ఏనాడూ స్వామి వారితో నేరుగా ఈ విషయమై ప్రస్తావన తెచ్చినది లేదు.
ఒకనాడు స్వప్నంలో శ్రీ స్వామి వారు, అందం, ఎత్తు వున్న వ్యక్తిని చూపించి, నీకు ఇలాంటి అందగాడు దొరకడు అని చెప్పి,ఒక ఫొటో చూపించి ఇతడే నీకు భర్తగా వస్తాడు అని చెప్పారు.
నేను మనస్సు భారంతో నిద్ర లేచి కాసేపు ఏడ్చి, నాకు నేను సముదాయించికొని, నాయన ఏమిచేసినా నా మంచి కోసమే కదా అనుకున్నాను.
ఆరోజే మా బాబాయి ఒక సంబంధం తీసుకుని వచ్చారు, ఆశ్చర్యంగా ఆ ఫొటోలోని వ్యక్తి, నాయన స్వప్నంలో చూపించిన వ్యక్తి ఫొటో ఒకటే.నేను మరో ఆలోచన చేయకుండా అతనితోనే పెళ్ళి చేసేయండి అని మా పెద్దలకు చెప్పేశాను.
వారు అనంతపురంలోని మా బాబాయి ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాకు అబ్బాయి నచ్చకపోయినా నాయన చూపించిన వ్యక్తి కదా అని పెళ్ళికి అంగీకారం తెలిపాను.
తరువాత, తిరుపతిలో శ్రీ స్వామి వారిని కలిసి, స్వామి ముందర మోకాలిపై కూర్చుని నాయన మీరు స్వప్నం లో చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నాను అని, ఆ వ్యక్తి ఫొటో స్వామి వారికి అందించాను.
శ్రీ స్వామివారు నా వైపు చూసి, అరగంట మంచం పై దొర్లి దొర్లి నవ్వుతున్నారు, నాకు కోపం వస్తోంది, తరువాత శ్రీ స్వామి వారు నన్ను చూసి నవ్వుతూ, నేను ఎవరిని చూపించినా పెళ్ళి చేసేసుకుంటావా పిచ్చిదాన ! అని నవ్వి నా తలపై చేయి వుంచి, ఇలాంటి వాడితో నేను నీ పెళ్లి జరిపిస్తానా !
మంచి వాడు, అందంగా ఉండేవాడు,నిన్ను బాగా చూసుకునే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తా అని అన్నారు.ఇది 2008 లో జరిగింది.
అన్నట్టుగానే శ్రీ స్వామి వారు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం, రూపం, గుణం కలిగిన వ్యక్తితో నాకు వివాహం 2011 లో జరిపించారు.
ఇటువంటి గొప్ప అనుభూతులను ఎన్నో శ్రీ స్వామివారు ప్రతిఒక్కరి జీవితంలో మిగిల్చారు.ఎప్పటికీ శ్రీ స్వామి వారి కరుణాకటాక్షాలు అందరిపై వర్షించాలని ప్రార్థిస్తూ.
ఓం నారాయణ అది నారాయణ.