My Marriage Happened with Swami's Blessings

Guravaiah swami devote Shyamala from India says :
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
నా వివాహ ప్రయత్నములు జరుగుతున్న సమయంలో, నేను శ్రీ స్వామి వారికి నా మనస్సులో ఈ విధంగా విన్నవించుకొనేదానను" స్వామి అందంగా వుండి, మంచి ఎత్తు, మంచి మనసు కలిగిన వ్యక్తి తో నాకు వివాహం కావాలి" అని. ఏనాడూ స్వామి వారితో నేరుగా ఈ విషయమై ప్రస్తావన తెచ్చినది లేదు.
ఒకనాడు స్వప్నంలో శ్రీ స్వామి వారు, అందం, ఎత్తు వున్న వ్యక్తిని చూపించి, నీకు ఇలాంటి అందగాడు దొరకడు అని చెప్పి,ఒక ఫొటో చూపించి ఇతడే నీకు భర్తగా వస్తాడు అని చెప్పారు.
నేను మనస్సు భారంతో నిద్ర లేచి కాసేపు ఏడ్చి, నాకు నేను సముదాయించికొని, నాయన ఏమిచేసినా నా మంచి కోసమే కదా అనుకున్నాను.
ఆరోజే మా బాబాయి ఒక సంబంధం తీసుకుని వచ్చారు, ఆశ్చర్యంగా ఆ ఫొటోలోని వ్యక్తి, నాయన స్వప్నంలో చూపించిన వ్యక్తి ఫొటో ఒకటే.నేను మరో ఆలోచన చేయకుండా అతనితోనే పెళ్ళి చేసేయండి అని మా పెద్దలకు చెప్పేశాను.
వారు అనంతపురంలోని మా బాబాయి ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నాకు అబ్బాయి నచ్చకపోయినా నాయన చూపించిన వ్యక్తి కదా అని పెళ్ళికి అంగీకారం తెలిపాను.
తరువాత, తిరుపతిలో శ్రీ స్వామి వారిని కలిసి, స్వామి ముందర మోకాలిపై కూర్చుని నాయన మీరు స్వప్నం లో చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నాను అని, ఆ వ్యక్తి ఫొటో స్వామి వారికి అందించాను.
శ్రీ స్వామివారు నా వైపు చూసి, అరగంట మంచం పై దొర్లి దొర్లి నవ్వుతున్నారు, నాకు కోపం వస్తోంది, తరువాత శ్రీ స్వామి వారు నన్ను చూసి నవ్వుతూ, నేను ఎవరిని చూపించినా పెళ్ళి చేసేసుకుంటావా పిచ్చిదాన ! అని నవ్వి నా తలపై చేయి వుంచి, ఇలాంటి వాడితో నేను నీ పెళ్లి జరిపిస్తానా !
మంచి వాడు, అందంగా ఉండేవాడు,నిన్ను బాగా చూసుకునే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తా అని అన్నారు.ఇది 2008 లో జరిగింది.
అన్నట్టుగానే శ్రీ స్వామి వారు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం, రూపం, గుణం కలిగిన వ్యక్తితో నాకు వివాహం 2011 లో జరిపించారు.
ఇటువంటి గొప్ప అనుభూతులను ఎన్నో శ్రీ స్వామివారు ప్రతిఒక్కరి జీవితంలో మిగిల్చారు.ఎప్పటికీ శ్రీ స్వామి వారి కరుణాకటాక్షాలు అందరిపై వర్షించాలని ప్రార్థిస్తూ.
ఓం నారాయణ అది నారాయణ.
No comments:
Post a Comment