How Swami helped me in difficult situtations

Guravaiah swami devotee Syamala from India says:
ఓం నమో శ్రీ గురవయ్య స్వామినే నమః
2015వ సంవత్సరంలో శ్రీ స్వామివారి మండలారాధన మహోత్సవములు జరుగుతున్నవి.నేను నా భర్తతో కలసి ఆశ్రమమునకు చేరుకోవడానికి ఒక ప్రైవేటు బస్సు ఎక్కి మల్లవరంలోని గురవయ్య స్వామి గుడిదగ్గర ఆపండి అని డ్రైవరుకు విన్నవించుకున్నాము. అతను మాకు తెలియదు, మీరు లేచి వచ్చి ప్రదేశం చూపిస్తే బస్సు ఆపుతాను అన్నాడు.మేము అలాగే అని చెప్పి బస్సులో ఎడమ వైపు ముందు సీట్లో కూర్చున్నాము.
శ్రీ స్వామివారి మహాసమాధి అనంతరం ఆశ్రమమునకు విరివిగా ప్రయాణం చేయడం మరియు ఉద్యోగ పరమైన ఒత్తిడుల వలన ఇద్దరమూ బాగా అలసిపోయివున్నాము
బస్సు బెంగళూరు దాటగానే, ఇద్దరమూ మంచి నిద్రలోకి జారుకున్నాము. , ఆ ప్రదేశమే తెలియదు అన్న వ్యక్తి మల్లవరం సాయిబాబా గుడి దగ్గర 15నిమిషాలు బస్సు ఆపి మల్లవరంలో దిగవలసిన వాళ్ళు రండి అని అరుస్తూ వున్నారు, బస్సులో అందరికి మెలకువ వచ్చి మేముకాదు మేముకాదు అంటున్నారు.ముందర వున్న మాకు మాత్రం మెలకువ రాలేదు, ఎవరో వచ్చి ఆ ముందర పడుకున్న వాళ్ళని అడగండి అని అన్నారు.అప్పుడు ఆ వ్యక్తి వచ్చి మమ్మల్ని నిద్రలేపి మీరేనా మల్లవరంలో దిగాల్సింది అని అడిగాడు, అవును అని సమాధానం చెప్పగానే, 15నిమిషాల నుండి అరుస్తున్నాను, మరి ఇంత మొద్దు నిద్ర అయితే ఎలాగా, మీ స్వామి ఎవరో కానీ బలే కాపాడాడు, బస్సు చిన్న సమస్య వచ్చి ఆగింది, అది చెక్ చేయడానికి బస్సు అపాము.ఇది మల్లవరం అని కింద ఎవరో చెబితే మీరు బస్సు ఆపమన్న విషయం గుర్తుకు వచ్చింది, లేకపోతే విజయవాడ వెళ్ళిపో దుము అన్నాడు.
శ్రీ స్వామి వారి మహిమ కాకపోతే మల్లవరం దగ్గర బస్సు ఆగిపోవడం, ఆ వ్యక్తి మమ్ములను గుర్తు ఉంచుకుని నిద్రలేవడం అంతా ఎదో గమ్మత్తుగా జరిగింది.
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
మరియొక సంఘటన
ఓం నమో శ్రీ గురవయ్య స్వామినే నమః
శ్రీ స్వామివారి మహాసమాధి అనంతరం నేను మరియు నాభర్త ప్రతి వారాంతంలో బెంగళూరు నుండి మల్లవరం ఆశ్రమమునకు వెళ్లి సేవ చేసుకోవడం అలవాటు.
2018వ సంవత్సరంలో నా భర్త ఉద్యోగనిమిత్తము గురుగ్రాంలో వుండేవారు. నేను ఒక్కదాన్నే ఆశ్రమానికి వెళ్లేదాన్ని , ఒక శుక్రవారం రాత్రి బెంగళూరు నుండి శ్రీకాళహస్తి వెళ్లే బస్సు ఎక్కాను.నేను ప్రయాణించే బస్సు నేరుగా ఆశ్రమం ముందే ఆపుతారు.పలమనేరు దాటిన తరువాత నేను మంచి నిద్రలోకి జారుకున్నాను,ఉన్నట్టుండి మెలకువ రావడంతో బయటకు చూసాను, బస్సు ఆశ్రమం దాటి మల్లవరం వెళ్లిపోతోందని భ్రమపడి డ్రైవర్ మీద కోపంతో ముందుగా మాట్లాడినట్టు మల్లవరం దగ్గర బస్సు ఆపకుండా వెళ్ళిపోతావా అని అరిచి, బస్సు ఆపించి దిగేసాను.చాలా ముందుకు వచ్చేసాను అని అనుకుంటూ వెనకకు ఒక కిలోమీటరు మేర నడిచాను, కానీ ఆచుట్టుప్రక్కల ఒక ఇల్లు కాని, అంగడి కానీ లేవు.నాకు భయం వేసింది, అప్పుడు సమయం తెల్లవారుజాము 2గంటల 45నిమిషాలు, చుట్టూ చీకటి,రోడ్డుపై వచ్చే వాహనాల వెలుతురు తప్ప ఏమీ లేదు.చేతిలో మొబైల్ వున్న సంగతి కూడా మరిచిపోయాను ఆ కంగారులో. కాసేపు రోడ్డు ప్రక్కగా ఆగి శ్రీ స్వామి వారిని మనస్సులో గట్టిగా తలచుకున్నా, కంగారు కాస్త తగ్గింది, అప్పుడు గుర్తుకువచ్చింది, మొబైల్ వుంది (దురదృష్టం ఏమంటే మొబైల్ టారిఫ్ కూడా అయిపోయింది), ఎక్కడవున్ననో తెలుస్తుంది అనుకుని లొకేషన్ చూస్తే అది పూతలపట్టు అటవీప్రాంతం, తరువాత తెలిసింది అది నక్సలైట్లు సంచరించే ప్రదేశమని,
రోడ్డుపైకి వచ్చి బస్సులు ఆపే ప్రయత్నం చేశాను,మిగతా లారీలు, కార్లు లాంటి వాహనాలు దగ్గరికి వస్తున్నాయి కానీ, ఒక్క బస్సు కూడా ఆపడం లేదు.ఒక ప్రక్క విసుగు మరో పక్క భయంతో ఎక్కడైనా దాక్కుని, తెల్లవారు ఝామున బయటికి వద్దామని అనుకున్నాను, చివరి ప్రయత్నంగా నాయన మీద భారం వేసి ఈసారి ఏ బస్సు అయినా సరే ఆగితే ఎక్కెద్దామని నిశ్చయించుకున్నాను.ఒక 10నిమిషాలు ఎదురుచూసిన పిమ్మట ఒక ప్రైవేటు ఏసీ బస్సు ఆగింది.ఆ బస్సు డ్రైవర్, అతని సహాయకులు నన్ను బస్సు ఎక్కించుకుని ఎవరమ్మా నీవు, ఈ సమయంలో ఇక్కడికి పోలీసులు రావడానికి కూడా భయపడతారు,ఎవ్వరూ ధైర్యం చేసి ఇక్కడ బస్సులు ఆపరు,ఇదంతా నక్సలైట్లు ఉండే ప్రదేశం అన్నారు.
నేను నిద్రమత్తులో మల్లవరం గురవయ్య స్వామి ఆశ్రమం అనుకుని దిగేసాను, ఆ డ్రైవర్ని అడిగితే ఇది మల్లవరం కాదని ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నాను.వారు వెంటనే మేము కూడా వెంకయ్య స్వామి భక్తులము, నిత్యం గొలగమూడికి వెళతాం అన్నారు.మనస్సులో నాయనకు,వెంకయ్య స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.వారు నన్ను తిరుపతి ఆర్టీసీ బస్టాండు వద్ద జాగ్రత్తగా దింపివేసారు.
బస్టాండులోకి వెళ్లేసరికి నన్ను మద్యదారిలో దింపేసి వచ్చిన బస్సు అక్కడేవుంది.ఆ డ్రైవర్,కండక్టర్ని గట్టిగా మందలించి మీ పైన కేసు వేసి ఉద్యోగాలు వూడగొడతాను అని బెదిరించాను.వారు వచ్చి అందరిముందూ నాకు క్షమాపణలు చెప్పి, నిద్రమత్తులో మాకేమీ అర్థం కాలేదు అని బాధపడ్డారు.వారి సంగతి నాయనే చూసుకుంటారు అని వదిలేసాను.ఆ తరువాత ఆ బస్సులోనే ఉదయం 4 గంటలకు శ్రీ స్వామి వారి ఆశ్రమమునకు చేరుకోవడం జరిగింది.
సదా మీ బిడ్డల రక్షణ భారం మీరు వహిస్తారు అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి కావాలి తండ్రీ.
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
మరియొక సంఘటన
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః
2019వ సంవత్సరం జనవరిలో నా భర్త కెన్యాలో ఉండేవారు.ఆ సమయంలో కూడా నేను ఒంటరిగానే ఆశ్రమముకు వెల్లేదాన్ని, ఆదివారం రాత్రి 8గంటలకు తిరుపతిలో బయలుదేరి అర్ధరాత్రి ఒంటిగంటన్నర కు బెంగళూరు టిన్ ఫ్యా క్టరి బస్టాప్ లో బస్సు దిగాను.ఆ సమయంలో బస్టాప్ లో నలుగురు దూరం దూరంగా కూర్చుని వున్నారు, అంతకుమించి మనుషులు ఎవరూ లేరు. రోడ్డుపై కాస్త దూరంగా అక్కడక్కడా ఒకరిద్దరు వున్నారు.నేను ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేస్తున్నాను.ఎంతకీ ఒక క్యాబ్ కూడా బుక్ అవడంలేదు, ఇంతలో నాకు కాస్త దూరంలో సూటు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు స్కూటరు ఆపి నావైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు.అంతకు ముందే బస్టాప్ ముందు రెండుసార్లు అటూఇటూ స్కూటరులో తిరిగారు. వారి మాటలాడుకొనే విధానాన్ని బట్టి, ఒంటరిగా వున్న నన్ను టార్గెట్ చేశారని అర్థమయింది.
నేను ఎదురుతిరిగితే, వారి ఇంట్లో అమ్మాయి అలిగి వచ్చేసింది అని అక్కడవున్నవాళ్ళను ఒప్పించాలని కూడా అనుకుంటున్నారు.
నాకేమో ఒక్క క్యాబ్ కూడా బుక్ అవడంలేధు. నాయనా నాయనా అనుకుంటూ క్యాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను.వారిలో ఒకడు నా దగ్గరగా వస్తున్నాడు.నాకు కంగారు ఎక్కువయింది, ఎవరూ సహాయం చేసేవారు లేరు, పోలీసుల కోసం చుట్టూ చూసాను, పోలీసు వాహనం వుంది కానీ అందులో ఎవరూ లేరు. ఇంకొక్క రెండు అడుగులు వాడు వేస్తే నన్ను చేరుకుంటాడు, అదే సమయంలో నాముందు వేగంగా ఒక కారు ఆగడం, నా ఫోన్ లో క్యాబ్ వివరాలు రావడం ఒకేసారి జరిగింది. వెంటనే కారులో ఎక్కికూర్చున్నాను. ఎంత వేగంగా కారు వచ్చి ఆగిందో, అంతే వేగంగా బయలుదేరింది.
నన్ను పట్టుకోవాలని చూసిన వ్యక్తి వెంటనే వెనక్కు వెళ్ళి, ముగ్గురూ కలిసి స్కూటరు పైన మూడు కిలోమీటర్లు మా కారును వెంబడించారు. మా కారు వేగాన్ని అందుకోలేక వారు ఆగిపోయారు.టిన్ ఫ్యాక్టరీ బస్టాప్ నుండి మా ఇంటికి మామూలుగా 45-50 నిమిషాల సమయం పడుతుంది.అటువంటిది కేవలం ఇరవైనిమిషాలలో మా ఇంటిదగ్గర వున్నాను.ఇన్ని సంవత్సరాలుగా ఏనాడూ క్యాబ్ సమయానికి రావడం కానీ, కనీసం రెండుమూడు సార్లు ఫోన్ చేసి డ్రైవరు చెప్పిన దగ్గరికి మేము వెళ్ళవలసి వచ్చేది. అటువంటిది ఈ అపత్సమయంలో వచ్చిన కారు డ్రైవరు నాకు సాక్షాత్తూ శ్రీ గురవయ్య స్వామి వారే అనిపించింది.
కారులో కూర్చున్న తరువాత వారు వెంబడిస్తుంటే నేను వారిగురించి చాలా బాధపడ్డాను" వీరు అనవసరంగా నా జోలికి వస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు, అనవసరంగా భవిష్యత్తు పాడు అవుతుంది, నాయన వీళ్ళని వదలరు, వీళ్ళ గతేమవుతుందో అని"
శ్రీ గురవయ్య స్వామి వారు తన బిడ్డలను ఎలా వెంటవుండి రక్షిస్తారో ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి కావాలి.
ఓం నారాయణ ఆది నారాయణ
ఓం నమో శ్రీ గురవయ్య స్వామి నే నమః.
No comments:
Post a Comment